6 రామాప్తులు

Описание к видео 6 రామాప్తులు

రామాప్తులు

శ్రుతితాత్పర్యపు వస్తువున్ తపసుతో చోద్యంపు చిన్నారి యా
కృతిగా గాంచిన తల్లిపాదముల భక్తిన్ మ్రొక్కి, ప్రాణమ్ములా
తతమై నీయెడ ధారవోసిన మహాధన్యాత్ముడౌ తండ్రికిన్
నతులర్పించెద బాలరాఘవ విభూ! నా రామచన్ద్ర ప్రభూ! 39

చిననాడాటలలోన వీడడు సరే శ్రీరామ! నీ వెంట తా
వనమందున్ రణమందు నీడగు; భగవతేపట్టాభిషేకోత్సవ
మ్మున్ నీ ప్రక్కనె నిల్చికొల్చుకొను తమ్ముండైన సౌమిత్రి ని
న్గననే ఘట్టమునైన నీ సహితుడౌగా రామచన్ద్ర ప్రభూ! 40

తన కర్తృత్వము నీదు పాదుకలపై దత్తమ్ము, చిత్తమ్ము నీ
ఘన నీలోజ్జ్వల రూపసంపదకు సాంగత్యము గావించి, హృ
త్తనువుల్ రామపదాంకమైన భరతోద్యన్నామ సద్భక్తికే ననవద్యమ్ముగ వందనమ్మిడుదు నాధా! రామచన్ద్ర ప్రభూ! 41

విద్యాసంపద, ధీవిదగ్ధతలు వేవేలైనగానిమ్ము హృ-
ద్వేద్యా! నీకు సమర్పణంబుగను నైవేద్యంబు సేయంగసం
పాద్యంబీగతి బోధజేసెకద విశ్వామిత్రుడే, సత్తపో
విద్యల్ నీయెడ ధారవోసి, వరచాపీ! రామచన్ద్ర ప్రభూ! 42

శిలపై తాపస నిష్ఠబూని హృది సచ్చిత్తత్త్వమే నిల్పి, తా
నిలిచెన్ గా వరమైన శాపమున నీనిండైన రూపమ్ము, క
న్నుల సాఫల్యము గాంచి, ఇయ్యదియె హృన్మూలమ్ము బ్రహ్మమ్మటం
చిల దర్శించిన తల్లి, యామెకు నతుల్ హే! రామచన్ద్ర ప్రభూ! 43

తనలో సత్తువకొద్ది పోరి యసువుల్ త్యాగమ్ము గావించి, ని
న్గనుదాకన్ కొనప్రాణముల్ నిలిపి హృత్కంజమ్ము నీకిచ్చి, నీ
ఘనసాన్నిధ్యమునందు నాయువిడి వేగన్ నీదు సాయుజ్యమున్
గొని శోభిల్లిన పక్షిరాజునకు మ్రొక్కుల్ రామచన్ద్ర ప్రభూ! 44

కనులన్ ప్రాణములన్ని నిల్పి ఋషి వాక్యముల్ మదిన్నమ్మి తా
నిను జూడంగ ‘నిదేయిదే మదిని తానిన్నాళ్లు ధ్యానించు మో
హన దీప’మ్మని పోల్చి తాపసఫలమ్మందించి యాతిధ్యమి
చ్చిన ధన్యాత్మను మ్రొక్కుకొందు, గుణరాశీ! రామచన్ద్ర ప్రభూ! 45

నీ మిత్రత్వములోని మెత్తదనమున్, నీ మాటలో బల్మి, నీ
సామీప్యమ్మున క్షేమసంపద లభీష్టప్రాప్తి, నీసేవలో
శ్రీమాధుర్యము జాటిరయ్య గుహసుగ్రీవుల్ విభూ! వారికై
కైమోడ్పుల్ ఘటియింతు నాశితమహాగా! రామచన్ద్ర ప్రభూ! 46

పుట్టెన్ వానరుడౌచు విక్రమకళాస్ఫూర్తిన్ నృసింహుండుగా
నట్టే దానవహంత; వేగగతిలోనా వైనతేయుండె; తా
జుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై; శోకాబ్దిలోనుండి పై
బెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగ నాభీలోగ్రపంచాస్యుడై
మెట్టెన్ నామది నీదు దూతయిదె స్వామీ! రామచన్ద్ర ప్రభూ 47

స్వామీ! నీ హృదయమ్మె రూపుగొని యా సామీరిగా మారి, నీ
ప్రేమమ్మున్ ధరణీజతో తెలిపి, త్వత్కృత్యోగ్రభావమ్మును -
ద్దామ క్రీడ మహాగ్నిగా రిపుపురిన్ దగ్ధంబుగావించి, నీ
శ్రీమన్మంజులగాధ సుందరము జేసెన్ రామచన్ద్ర ప్రభూ! 48

అవనీజాతయె సాక్షిగా వనములో నందంపు నీగాధ, చి
చ్ఛవులొల్కంగ కపీశ్వరుండు నుడివెన్ స్వారస్యముల్ చింద, శ్రీ
ధవ! రామాయణమందు రామకధ నుద్దామక్రియన్ బల్కు నా
కవిసామ్రాట్టును మారుతిన్ గొలుతు వేడ్కన్! రామచన్ద్ర ప్రభూ! 49

వేవేలైన దశాస్యులన్ దునుము దోర్వీర్యప్రభావప్రభా
శ్రీవిద్యన్ తనలో నిముడ్చుకునె నీ చిత్తమ్ము దా దెల్సి, తా
నై వీరుండను మాటగన్న రఘురాడ్దాసుండ నేనంచు వీ
రావేశమ్మున జాటె వాయుసుతుడయ్యా రామచన్ద్ర ప్రభూ! 50

తనలోనున్న మహత్త్వమెల్ల మఱచెన్ తండ్రీ! మరుత్సూతి నీ
ఘన కార్యమ్మును బూనుదాక, తలపంగా సర్వధీదోర్బల
మ్మును నీకోసమె దాచిపెట్టుకొని, రామోత్సాహియై వెల్కితీ
సెను రుద్రాత్మకుడైన సామి శుభరాశి! రామచన్ద్ర ప్రభూ! 51

కనకక్ష్మాధరమందు నీలనవమేఘంబోయనన్ ఠీవిగా
హనుమద్వీరభుజమ్ముపై వెలిగి ఘోరాకారదైతేయులన్
దునుమంగా జను నీదు మూర్తి మనమందున్ ధ్యేయమైచూచితిన్
ఘనసద్భక్తియై నిన్ను నెత్తుకళ కాగా రామచన్ద్ర ప్రభూ! 52

ఒకమారైన ‘తవాస్మి’యంచు శరణమ్మొందంగ దీవ్యత్కృపా
త్మకమౌ నీయభయమ్మునొందు నిది తధ్యమ్మంచు నీ చేతనే
ప్రకటింపించిన యవ్విభీషణుని సద్భక్తి క్రియాశక్తికే
నకలంకాత్మత మ్రొక్కుకొందు శ్రితపోషా! రామచన్ద్ర ప్రభూ! 53

తన శైవార్చన తీవ్రతాపసకళా నైపుణ్యముల్ పండగా
ఘనమౌ శత్రువుగా లభించితివి సంగ్రామోర్వియందుండి, ని
న్గని యుద్ధంబును జేయు దివ్యమగు భాగ్యంబిచ్చి, పౌలస్త్యు చ
య్యన ధన్యాత్ముని జేసితౌర రఘువర్యా! రామచన్ద్ర ప్రభూ! 54

నిను నీ నేలకు దింపినట్టి దనుజానీకంబు మాపాలికిన్
ఘనులై కన్పడు, నీదు రూపగుణసద్గాధాప్రపంచంబు గాం
గనదీమాతృకవోలె నీధరణికిన్ కైసేసి కైవల్యమున్
గొని రాజిల్లిన వారికెల్లరకు మ్రొక్కుల్ రామచన్ద్ర ప్రభూ! 55

హృదయమ్మేలెడి సార్వభౌమునిగ నేబ్రీతిన్ ప్రతిష్టించి నిన్
సదయా! పట్టము కట్టినాడను రమాజానీ! అయోధ్యాఖ్య నె-
మ్మది వైకుంఠము గాగ మారినది నీ మాహత్మ్య సంప్రాప్తిచే
నిదిగో సాగెను రామరాజ్య విభవంబే రామచన్ద్ర ప్రభూ! 56

ఒక నిన్నే ప్రభువంచు నెంచుకొనగా యోగీశ! ఆ వెంటనే
సకలమ్మౌచును నీదు సోదరులు నాక్ష్మాజాత, వాయ్వాత్మజా
దికులౌ బందుగులెల్లరాప్తులుగ నార్తిన్ బాపి నావారలై
ప్రకటింపింతురు రామభావనలు దేవా! రామచన్ద్ర ప్రభూ! 57

Комментарии

Информация по комментариям в разработке