పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం || Pawan Kalyan || AP Govt

Описание к видео పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం || Pawan Kalyan || AP Govt

దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు

• ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దాం... దీనికి నేను కంకణబద్ధుడినై పని చేస్తాను. నా ఒక్కడి వల్లనే ఈ మహా క్రతువు పూర్తి కాదు. ఉద్యోగుల సహకారం, సూచనలు నాకు చాలా అవసరం. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నాను’ అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు.

• వ్యవస్థలను ఎంత తీవ్రంగా దెబ్బ తీశారో శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తాము

వినతి పత్రాలను స్వీకరించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా దెబ్బ తీశారనేది... వ్యవస్థలను ఎంత నాశనం చేశారనే విషయాలను, కీలక శాఖల్లోని వాస్తవాలను ప్రజల ముందుపెట్టేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాము. పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తాను. ఎంతో ఇష్టంతోనే ఈ కీలకమైన శాఖలను తీసుకున్నాను. వ్యవస్థ మొత్తం అద్భుతంగా పని చేసేలా ముందుకు తీసుకెళ్తాను. సరైన నాయకత్వం లేకపోతే వ్యవస్థలు ఎలా నాశనం అవుతాయో గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. మళ్లీ వ్యవస్థలను గాడిలోపెట్టేందుకు, అవి పూర్తిగా ప్రజల కోసం పని చేసేలా తయారు చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేద్దాం. ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ, సాధక బాధకాలను అర్థం చేసుకుంటూ పునరుత్తేజం కలిగించేలా పాలన ఉంటుంది.

• వింటాను... ఆలోచిస్తాను... పరిష్కారం చూపుతాను

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. వారికి నేను ప్రత్యేకంగా గౌరవం ఇస్తాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. ఒకటో తేదీన జీతం రాకపోతే ఎంత కష్టమో కూడా అర్థం చేసుకోగలను. నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాత్రికి రాత్రి అద్భుతాలు చేసేస్తాను అని చెప్పను. ఉద్యోగుల వేదన వింటాను. వారి సూచనలను స్వీకరిస్తాను. మొదట మీ బాధలు ఆసాంతం వినేందుకు ప్రయత్నిస్తాను. అప్పటికప్పుడు పూర్తి చేసే సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తాను. ఓ సగటు సాధారణ మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన స్థాయిని నేను ఎప్పుడు మరిచిపోను. మీ కష్టాలు అన్ని నాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే కష్టాలను నా కుటుంబంలోని కష్టాలుగానే చూస్తాను.

• గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది.. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం

పెను తుపాను తర్వాత మళ్లీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. రాష్ట్రానికి అలాంటి సమయం ఇది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పాలకులు, ఉద్యోగులు పని చేసి వ్యవస్థలను నిలబెట్టాలి. ప్రజలకు పూర్తిస్థాయిలో వాటి సేవలు అందాలి. దీనికి ఏం చేద్దాం అనేది మీరు చెప్పండి. ఈ క్రతువులో మీ సమస్యలు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. వ్యవస్థలతో పాటు ఉద్యోగుల సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాను. ఉద్యోగ సంఘాల నాయకులు సమస్యను వివరించడమే కాదు. దానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కూడా సూచించండి. దానిపై తగిన సహేతుకమైన నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వ వెన్నెముక ఉద్యోగులే. వారిని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదు. చిన్న చూపు చూసే వ్యక్తిని అంతకంటే కాదు. మీ సమస్య నా సమస్యగా భావిస్తాను. మీ సమస్యలన్నీ వినగలిగే శక్తి పూర్తిస్థాయిలో ఉన్న వాడిని.

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగ సంఘాల నుంచి అందిన వినతులు

• ఉద్యోగ సంఘాలను సైతం గత ప్రభుత్వం భయపెట్టింది. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి తెచ్చారు. జీపీఎఫ్ నిధులు మళ్లించేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందాలి. జీపీఎఫ్ లోన్లు, సరండర్ లీవ్ ల వేతనాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్ అందాలి. 12వ పీఆర్సీ కమిషనర్ తోపాటు తగినంత సిబ్బందిని వెంటనే నియమించాలి. పెండింగ్ లో ఉన్న డీఏ ఎరియర్స్ చెల్లించాలి.

ఏపీ జేఏసీ అమరావతి

• కొత్త జిల్లాలకు సంబంధించి డీఎల్పీఓ పోస్టులను ప్రతి జిల్లాకు పూర్తి స్థాయిలో ఇవ్వాలని, పంచాయతీ డివిజినల్ అధికారి లేదా దానికి తగిన హోదా కలిగిన అధికారులతో వాటిని భర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ అండ్ డివిజినల్ పంచాయత్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సభ్యులు కోరారు.

• ఎంపీడీవో పదోన్నతుల్లో సూపరిండెంట్ లకు తగిన విధంగా న్యాయం చేయాలని 34 శాతం కోటాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టిరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు.

• గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేషన్ కోరింది.

• మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన విధంగా 23 శాతం పీఆర్సీ జీతాల పెంపుదల చేయాలని, కొన్ని క్యాడర్ల సిబ్బందికి గ్రేడ్స్ ఫిక్సేషన్ పై ప్రభుత్వం పంపిన కమిటీ రిపోర్టు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు.

#PawanKalyanAneNenu #JanaSena #panchayat #employees #govt #prc #village #mahatmagandhi #deputycmpawankalyan #deputycm #association #mpdo #ap #jac #andhrapradesh #amaravathi
#JanaSenaParty #PawanKalyan #funds #government #govtjobs #gpf #cps #retired

Комментарии

Информация по комментариям в разработке