🙏🌹 సౌందర్య లహరి : 7 , 8 శ్లోకాలు 🌹🙏
||అమ్మవారి సగుణరూప ధ్యానం II
క్వణత్ కాంచీదామా కరికలభ కుంభ స్తన నతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా I
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా II 7 II
తాత్పర్యముః
అమ్మా!! త్రిపురాసురసంహారం చేసిన పరమశివుని యొక్క శౌర్య స్వరూపిణి అయిన జగన్మాతా!! కింకిణీ రవములు చేయు బంగారు చిరుగంటలను మొలనూలుగా (నడుముకి ఆభరణముగా) కలిగి, గున్నఏనుగుల కుంభస్థలమును పోలియున్న మాతృసంపద (స్తనములు) కలిగి, బాగా కృశించిన సన్నని నడుము కలిగి, శరత్కాలములో పున్నమి చంద్రుని వంటి ముఖము కలిగి, ధనుస్సు, పుష్పబాణములు, పాశము మరియు అంకుశము అనే నాలుగు ఆయుధములను నీయొక్క నాలుగు చేతులలో ధరించిన అమ్మ మా యెదుట సాక్షాత్కరించుగాక !!
||అమ్మవారి నివాస స్థాన వర్ణన II
సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే
మణిద్వీపే నీపోవనవతి చిన్తామణిగృహే I
శివాకారే మఞ్చే పరమశివ పర్యఙ్కనిలయాం
భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్ II 8 II
తాత్పర్యముః
సుధా సింధోః - అమృత సముద్రము లేదా క్షీర సముద్రము,
మధ్యే - మధ్య ప్రదేశము నందు,
సురవిటపి - కల్ప వృక్షముల యొక్క,
వాటీపరివృతే - వరుసలతో చుట్టబడిన,
మణిద్వీపే -మణిమయమైన దీవి యందు,
నీపః - కదంబ వృక్షముల యొక్క,
ఉపవనవతి - ఉద్యానవనము నందు, చిన్తామణిగృహే - చింతామణులచే నిర్మింపబడిన గృహము నందు,
శివాకారే మంచే - శివాత్మకమైన మంచము నందు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులనే నలుగురు బ్రహ్మలచే మోయబడుచున్న మంచము),
పరమశివ - పరమశివుడి యొక్క,
పర్యఙ్కనిలయాం - తల్పము లేదా తొడని నెలవుగా గలిగిన,
చిదానందలహరీం - చిత్ శక్తి యొక్క ఆనంద తరంగములుగా యున్న,
త్వాం - నిన్ను,
కతిచన - కొద్దిమంది,
ధన్యాః - ధన్యులు మాత్రమే,
భజన్తి - సేవించుచున్నారు !
క్షీర సముద్రము యొక్క మధ్య ప్రదేశము నందు, కల్పవృక్షముల వరుసలచేత చుట్టబడిన మణిమయ మైన దీవి యందు, కదంబ వృక్షముల ఉద్యానవనములో చింతామణులచే నిర్మింపబడిన గృహము నందు, శివాత్మకమైన మంచము మీద, పరమశివుడినే తల్పముగా లేదా పరమశివుడి యొక్క తొడనే నెలవుగా కలిగిన, చిత్ శక్తి యొక్క ఆనంద తరంగములుగా యున్న శ్రీ లలితాపరమేశ్వరీ , నిన్ను బహుకొద్దిమంది పుణ్యాత్ములు/ధన్యులు మాత్రమే సేవించి తరించుచున్నారు !!
భావార్థముః
శ్రీచక్రనగరము నందు ఉన్న వివిధ ఆవరణలు, మధ్యలో మేరువు, ఆపైన ఉన్న చింతామణిగృహము, అందులో కొలువై ఉండే సకల పరివారదేవతలు, అమ్మవారి నివాసస్థానము వగైరా పరిశీలించి అప్పుడు సాధనాపరంగానూ మరియు తత్త్వపరముగానూ ఈ శ్లోకమును ఎలా అన్వయించుకోవాలో, శంకరులు ఇచ్చిన అద్భుతమైన ఈ అమృతభాండాన్ని, అమ్మవారి అనుగ్రహంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
మొదట శ్రీలలితా సహస్రనామములోని ఈ క్రింది నామములను పరిశీలిద్దాము.
సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా I
చింతామణిగృహాంతఃస్థా పంచబ్రహ్మాసనస్థితా II
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ I
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ II
సుమేరుమధ్యశృంగస్థా - శ్రీమన్నగరనాయికా అనగా, మేరుపర్వతము యొక్క మధ్య శృంగము మీద నిర్మింపబడిన శ్రీనగరము నందు మహాకామేశ్వరుడితో కూడి అమ్మవారు కొలువై ఉంటుంది.
చింతామణిగృహాంతఃస్థా - ఆ సుమేరు యొక్క మధ్య శృంగము మీద చింతామణులతో నిర్మింపబడిన గృహము నందు కొలువై ఉంటుంది అమ్మవారు..
పంచబ్రహ్మాసనస్థితా - చింతామణిగృహములో బిందుపీఠము నందు లేదా సర్వానందమయ చక్రము నందు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులే నాలుగు కోళ్ళగా మ్రోయుచున్న గొప్ప మంచము ఉన్నది.
దీనినే శంకరులు శివాకారే మంచే అన్నారు పై శ్లోకములో. సదాశివుడు ఆ మంచము మీద పానుపుగా అన్నట్టు శయనించి ఉంటారు. అమ్మవారు అలా శయనించి పరుపుగా ఉన్న సదాశివుని యొక్క అంకముమీద కూర్చొని ఉంటారు. ఇక్కడ నలుగురు బ్రహ్మలతో పాటు, సదాశివునితో కలిపి ఐదుగురు అమ్మవారికి ఆసనం అయ్యారు కనుక పంచబ్రహ్మాసనస్థితా అని పిలువబడినది అమ్మవారు.
మహాపద్మాటవీ సంస్థా - శ్రీచక్ర నగరంలో శృంగారమయ ప్రాకారము దాటిన తర్వాత - అమ్మవారు నివాసం ఉండే చింతామణి గృహము యొక్క తొమ్మిది ఆవరణలలో మొదటిదైన త్రైలోక్యమోహన చక్రములోకి ప్రవేశించే ముందు, చింతామణి గృహము చుట్టూ పద్మముల వనం ఉంటుంది. ఈ వనం దాటి వెళ్తేనే శ్రీచక్రము నందు ఉన్న తొమ్మిదవ ఆవరణలోకి వెళ్ళగలము.
శ్రీచక్రనగరము - మానసిక విహంగవీక్షణముః
· పదునాలుగు లోకములచేత నిండి, బంగారు ఇండ్ల వరుసలు కలిగి, దేవతల గానములు గల మేరు పర్వతము..
· మేరు పర్వతమునకు తూర్పు, నైరుతి వాయువ్య దిశలలో బ్రహ్మ, విష్ణు, శివుని లోకములైన మూడు శిఖరములు
· పై మూడు శిఖరముల మధ్యలో ఉన్నతమైన 400 యోజనముల పొడవైన, మణికాంతుల మయమైన శృంగపుంగవము (శ్రేష్ఠమైన శిఖరము)
· ఈ శిఖరము నందు, నాలుగు వందల యోజనముల వైశాల్యము కలిగి, విశ్వకర్మచే నిర్మింపబడిన, అనేక ప్రాకారముల చేత ప్రకాశించుచున్న ఆదివిద్యా స్వరూపిణి కొలువై ఉన్న శ్రీపురము/శ్రీనగరము -
· ఈ శ్రీచక్రనగరములో ఇరవై ఐదు ప్రాకారములు ఉన్నాయి (మణిద్వీపములో నవావరణలు వేరు - ఈ ఇరవై ఐదు ప్రాకారములు దాటిన తర్వాత, మణిద్వీపము, అందులో తొమ్మిది చక్రముల/ఆవరణల వర్ణన వస్తుంది).
శృంగారమయ ప్రాకారమునకు పై భాగమునందు సమస్తదేవతలచేత ఆరాధింపబడునది, చింతామణులచేత నిర్మింపబడిన చింతామణి గృహము కలదు. ఈ గృహము చుట్టూ సకల దేవతలు, సిద్ధులు ఉంటారు.
చింతామణి గృహంలో మొత్తం తొమ్మిది ఆవరణలు గలవు.
· తొమ్మిదవ ఆవరణ - త్రైలోక్యమోహన చక్రం - ఇందులో మూడు ఆవరణలు ఉంటాయిః
ఈ చక్రము నందు ప్రకటశక్తులైన అణిమాది అష్టసిద్దిదేవతలు, బ్రాహ్మ్యాది అష్టమాతృదేవతలు మరియు సంక్షోభిణ్యాది దశముద్రాదేవతలు ఉంటారు, ఈ ప్రకటశక్తులకు అధిదేవత త్రిపురాదేవి.
చిదానందలహరీమ్ -
సుధాసింధువు నందు, కల్పవృక్షముల మధ్యన ఉన్న మణిద్వీపములో, కదంబవృక్షముల ఉద్యావనము నందు ఉన్న చింతామణి గృహములో పంచబ్రహ్మాసము మీద ఆసీనమై ఉన్న తల్లిని ‘చిదానందలహరీమ్’ అని చెప్పారు శంకరులు.
🙏🌹🙏
Информация по комментариям в разработке