Evaru? Evaru? Evaru? (ఎవరు? ఎవరు? ఎవరు?) | Lyrical Song-125 | గురుపౌర్ణమి-బక్రీదు - తొలి ఏకాదశి Spl

Описание к видео Evaru? Evaru? Evaru? (ఎవరు? ఎవరు? ఎవరు?) | Lyrical Song-125 | గురుపౌర్ణమి-బక్రీదు - తొలి ఏకాదశి Spl

గురుపౌర్ణమి సందర్భముగా....
ముముక్షువుగా మారిన ఏ క్షరునికైనా మూడు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానములు తెలిసియుండవలెను, అవి 1 . భక్తి అనగానేమి? 2 . ఆధ్యాత్మికమనగానేమి? 3 . గురువు ఎవరు?

గురువు అనగా గుహ్యమైనవాడు, గుర్తింపబడనివాడు అని గ్రహించవలెను. విశేషమైన శ్రద్ధగలవానికి గురుజ్ఞానమును పొందుట సుసాధ్యమేయైనా, గురువును గుర్తించుట మాత్రము దుస్సాధ్యమైన పనియే అని చెప్పవచ్చును.

ప్రాథమిక భక్తిని పొంది, మూడు ఆత్మల జ్ఞానమును అభ్యసించి, ఆధ్యాత్మికవేత్తగా మారిన ఏ జీవుడైనా తనలో విశేష భక్తిని అలవరించుకొనుటకు, తనలో తాను సంధించుకొనవలసిన ముఖ్యమైన ప్రశ్నయే "గురువు ఎవరు?". మూడుముడులను వేసిన మూటవంటి ఈ ప్రశ్నను, తాను గ్రహించుకొన్న ఆధ్యాత్మికమనే నేర్పుతో, యోగమాయను సహనంతో దాటగల ఓర్పుతో, గురువును పొందవలెననే భక్తియొక్క కూర్పుతో విడదీసి చూసినయెడల, తన ఆధ్యాత్మికపథ ప్రయాణములోని ఆఖరి గమ్యమైన "గురువు" సమాధానముగా మారి ఖచ్చితముగా దొరకగలడు.

ఈ విశ్వములో విశ్వవిద్యాలయములు రెండు విధములుగా గలవు:
1 . గురువు బాహ్యముగా దేహమును ధరించి (ప్రబోధాత్మగా) నివాసముండు స్థానము (అదియే అధికార పీఠము లేక ప్రబోధాశ్రమము)
2 . శరీరాంతర్గతమున గురువు (ఆత్మప్రబోధగా) నివాసముండు స్థానము (అదియే గురుపీఠం లేక ఆనందాశ్రమము)

ఈ రెండు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధము కలిగియున్నవి. వీటిలో ఒకదానితో సంబంధమును కోల్పోవువాడు, రెండవదానిని కూడా కోల్పోయినవాడగును. అలాగే ఒకదానిని పొందినవాడు, రెండవదానిని కూడా పొందినవాడే అగును. బాహ్యముగా "గురువుకు" భక్తిచూపుటకు దేవుడిచ్చిన ధన, మాన, ప్రాణములను వదలుట ఎంత ముఖ్యమో, అలాగే అంతరముగా "గురువుకు" భక్తిచూపుటకు జీవుడు తన అహమును వదిలి, తనలో విశేషభక్తిని పెంపొందించుకొని తన పూర్ణ మనసును, పూర్ణ హృదయమును, పూర్ణ ఆత్మను ఆ గురుదేవునకు సమర్పించాలి. అప్పుడే నిజమైన "గురు పౌర్ణమి" కాగలదు.
అందరికీ గురుపౌర్ణమి సందర్భముగా శుభాకాంక్షలు !!!

బక్రీదు సందర్భముగా:
బఖరా అనగా ఆవు అని, ఈద్ అనగా పండుగ అని అర్థము.
పవిత్ర ఖురాన్ లోని మొట్టమొదటి సూరా పేరు "అల్ బఖర" అనగా "ఆవు" అని అర్థము. ఈ సూరా లోని 67 నుండి 71 ఆయత్ ల మధ్యన మూసా తన జాతివారితో ఒక అవును 'జిబహ్' చేయమని అల్లాహ్ ఆజ్ఞగా ప్రకటిస్తాడు.
ఈ ఆయత్ లలో మూడు రకముల ఆవులను చెపుతూ, మరీ లేగదూడ కాని అలాగే మరీ ముసలిదీ కానిదైన మధ్యవయస్సులోని అవును మాత్రమే "జిబహ్" చేయమన్నారు.
ఈ సారాంశమంతయూ ఎంతో నిగూఢమైనది, కావున ఈ ఆయత్ లు అన్ని కూడా ముతాషాభిహాత్ (సూక్ష్మ) వాక్యముల క్రిందకే వస్తాయి. వాటిలోని నిగూఢమైన భావమును మనకు అందించాలని, అక్కడ మూసా ద్వారా అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను మనచే పాటింపచేయాలని ఆ "గురు దేవుని" హృదయపూర్వకముగా కోరుకుంటున్నాము !!!

అందరికీ బక్రీదు సందర్భముగా శుభాకాంక్షలు !!!
ఆషాఢ శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు !

TEAM:
---------
Lyricist - Siva Krishna Kogili
Singer - Praveen Kumar Koppolu
Music - N Nagesh
Video Composition - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel

సాకీ:

గురువు లేకనే నీవు జ్ఞానమరయగ వచ్చు
గురువు లేక ముక్తి బడయ లేవు
గురుజ్ఞానము నీవు వెదకి పట్టగవచ్చు
గురుమూర్తినే బట్ట తరముగాదు ... అది నీ కరముగాదు
నీకు గురి కుదరినిదే ... ఆ గురు కృప నీపై కురవనిదే .. ఆ వరము నీకు దొరకబోదు ...
ఆ గురువు నీకు దొరకబోడు ... దొరకబోడు !

పల్లవి :

ఎవరు ఎవరు ఎవరు అంటు ఎంత వెతికినా ?
నీలోన వున్న గురువు నీకు బయట దొరుకునా?
ఏడి ఏడి ఏడి అంటు ఎంత వేడినా ?
నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా ?
ఊరిలోన వాడలోన ఏరి చూసినా .. ఊట ఊరుతున్న స్థలము వేటకందునా
దారిమారి దేహమందు తేరి చూసినా.. నీ దాపుగానె గురుదేవుడు అందకుండునా ... మరి అందకుండునా!
ఎవరు ఎవరు ఎవరు అంటు ఎంత వెతికినా ?
నీలోన వున్న గురువు నీకు బయట దొరుకునా?
ఏడి ఏడి ఏడి అంటు ఎంత వేడినా ?
నీలోన కూడివున్న వాని జాడ దొరుకునా ?

చరణము 1:
గుహలందున జొచ్చి నీవు గురురూపమునెతికినా
గుహ్యాన్నే చూపించే గురువు దొరుకునా?
గుడులన్నీ తిరిగి నీవు గుంజీలే తీసినా
గుణమన్నదిలేని గురుని గుర్తు దొరుకునా?
దేహములో నీ గుహను గుర్తెరిగీ గాంచగా
దేవుడుతానై గురుడు దొరకకుండునా
మేనే మరిచీ నీ మనసును గుడి త్రిప్పగా
నేనే నీవంటు గురుడు చెప్పకుండునా
పీఠాలే చుట్టి చుట్టి పాఠాలే నేర్చినా
గురుపీఠం గట్టు నిన్ను పట్టనిత్తునా !
షట్ గోప్యం జేసి గుణములన్నీ త్యజియించగా
శరీరాన గురుపీఠం అందకుండునా ... ఆ అధికారపీఠమే అందకుండునా !

ఎవరు ఎవరు ఎవరు అంటు ఎంత వెతికినా ?
నీలోన వున్న గురువు నీకు బయట దొరుకునా?
ఏడి ఏడి ఏడి అంటు ఎంత వేడినా ?
నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా ?

చరణము 2:
మందిరమస్జీదులలో చర్చీలలో వెతికినా
ఇందుజ్ఞానమందజేయు శక్తి దొరుకునా ?
మనుషులపై మనసు నిలిపి మాన్యుడినే కోరిన
మతద్వేషములేని వ్యక్తి మహిన దొరుకునా ?
దేహమందిరాన సప్తద్వారాలే దాటగా
ప్రార్ధన గ్రహియించి ప్రభువు పలుకకుండునా
దేహహద్దులోన అష్టగ్రంథిని నువు చేరగా
హృదయమధ్యమాన ఆత్మ అంటకుండునా
ఆశ్రమాల చుట్టు బ్రమచి ఆర్తితొ అర్ధించినా
ఆనందాశ్రమ స్థానం చేరనిత్తునా !
అహమంతా అణిచివేసి ఆరాతీస్తే మరి
ఆ అంతరాన ఆశ్రమమే అందకుండునా ... శ్రీ ప్రబోధాశ్రమమే అందకుండునా ... నీకు అందకుండునా!

ఎవరు ఎవరు ఎవరు అంటు ఎంత వెతికినా ?
నీలోన వున్న గురువు నీకు బయట దొరుకునా?
ఏడి ఏడి ఏడి అంటు ఎంత వేడినా ?
నీలోన కూడివున్న వాని జాడ దొరుకునా ?
ఊరిలోన వాడలోన ఏరి చూసినా .. ఊట ఊరుతున్న స్థలము వేటకందునా
దారిమారి దేహమందు తేరి చూసినా.. నీ దాపుగానె గురుదేవుడు అందకుండునా ... మరి అందకుండునా
ఎవరు ఎవరు ఎవరు అంటు ఎంత వెతికినా ?
నీలోన వున్న గురువు నీకు బయట దొరుకునా?
ఏడి ఏడి ఏడి అంటు ఎంత వేడినా ?
నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా ? .. నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా ? ... నీలోన కూడివున్న వాని జాడ దొరుకునా ?

Комментарии

Информация по комментариям в разработке