Sai Gurukulam Episode1304 //8 జన్మల అనుబంధం ఉన్న సోదరి ఇంటికి శ్రీసాయి వచ్చి కూర్చున్న తీరు అద్భుతం.

Описание к видео Sai Gurukulam Episode1304 //8 జన్మల అనుబంధం ఉన్న సోదరి ఇంటికి శ్రీసాయి వచ్చి కూర్చున్న తీరు అద్భుతం.

Sai Gurukulam Episode1304 //8 జన్మల అనుబంధం ఉన్న సోదరి ఇంటికి శ్రీసాయి వచ్చి కూర్చున్న తీరు అద్భుతం.

బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న అంకితభక్తులలో విల్లేపార్లే(బొంబాయి) నివాసి శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఒకరు. బాబా ఆమెను ఆప్యాయంగా ‘బాయీ’ అని పిలిచేవారు. 1898వ సంవత్సరంలో ఆమె మొదటిసారి శిరిడీ దర్శించింది. తొలి దర్శనంలోనే బాబా దివ్యవర్ఛస్సుకు తనను తాను మైమరచి ఆనందపారవశ్యంలో మునిగిపోయింది. అప్పట్లో బాబా పాడుబడిన మసీదులోనో లేదా వేపచెట్టు క్రిందనో కూర్చుని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించడం, గుడ్డపీలికలతో ఉయ్యాలలా వ్రేలాడే చెక్కబల్లపై పడుకోవటం ప్రత్యక్షంగా చూసిన ఆమె, బాబా సిద్ధయోగీ౦ద్రులని, అవతారపురుషులని విశ్వసించి కొన్నిరోజులు శిరిడీలోనే గడిపి తిరిగి వెళ్ళింది. ఇక అప్పటినుండి ఆమె తరచూ శిరిడీ రాసాగింది. అప్పటికింకా సాఠేవాడా నిర్మాణం జరగలేదు. అందువలన ఆమె ఎప్పుడు శిరిడీ వెళ్లినా ఎవరైనా గ్రామస్తుల ఇంట్లో బసచేస్తుండేది. బాబా ప్రతిరోజూ తమ స్వహస్తాలతో కొద్ది పరిమాణంలో ఆమెకు ఊదీ ప్రసాదించేవారు. ఆమె ఆ ఊదీనెంతో పదిలంగా భద్రపరుచుకుంటూ ఉండేది. ఆమెకు ఆ ఊదీ యొక్క పవిత్రత, శక్తి బాగా తెలుసు గనుక దానిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండేది. ఎవరికైనా జబ్బు చేసినా, అపాయకర పరిస్థితి ఏర్పడినా ఆమె వారికి ఆ ఊదీని ఇస్తుండేది. బాబా ఆమెకు తమ పన్నునొకదానిని ప్రసాదించారు. దాన్ని ఆమె ఒక తాయెత్తులో ఉంచి శ్రద్ధగా పూజించుకొనేది. శ్యామారావు చిత్రించిన తన చిత్రపటం ఒకదాన్ని కూడా బాబా ఆమెకు ఇచ్చారు.

1918లో విజయదశమికి మూడునెలల ముందు జూలైలో బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళింది చంద్రాబాయి. అప్పుడు బాబా ఆమెతో, “బాయీ, ఇక మీదట నన్ను చూడటానికి నువ్విక్కడికి రానవసరం లేదు. నువ్వెక్కడున్నా నేను నీతోనే ఉంటాను!” అని అన్నారు. బాబా చూపిన ప్రేమాభిమానాలకు ఆమె కన్నుల నుండి ఆనందభాష్పాలు జాలువారాయి. తరువాత బాబా వద్ద నుండి ఊదీ తీసుకొని వెళ్ళిపోయింది. తరువాత కొద్దిరోజుల్లో విజయదశమి ఉందనగా శ్రీమతి చంద్రాబాయి బొంబాయి నుండి 159కి.మీ.ల దూరంలో ఉన్న పంచాగ్ని అనే ప్రాంతానికి వెళ్ళింది. పంచాగ్ని ఎంతో సుందర ప్రదేశమైనప్పటికీ ఆమె మనసులో ఏదో తెలియని అశాంతి, అలజడి చోటుచేసుకున్నాయి. దానివల్ల ఆ ప్రదేశంలో ఉన్న అందాలని ఆమె ఆస్వాదించలేకపోయింది. అక్కడ శిరిడీలో అస్వస్థతగా ఉన్న శ్రీసాయి తరచూ, “చ౦ద్రాబాయి వచ్చి౦దా?  అని అడుగుతున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఆ విషయాన్ని తెలియజేస్తూ, “బాబా పదేపదే మీ గురించే ఆలోచిస్తున్నారు. వారి ఆరోగ్యం చాలా వేగంగా దిగజారిపోతోంది. వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరు” అని ఆమెకు కబురు పంపాడు. ఆ కబురు అందిన వెంటనే ఆమె బయలుదేరి బాబా తుదిశ్వాస విడిచే సమయానికి శిరిడీ చేరుకుంది. బాబాను ఆ స్థితిలో చూసి ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లపర్యంతమైంది. అంతిమ సమయంలో ఆమె బాబా నోట్లో నీరు పోసింది. ఆ తరువాత 1919లో ఒకసారి, 1933లో ఒకసారి ఆమె శిరిడీ సందర్శించింది. బాబా ఆమెకు వాగ్దానం చేసినట్లు, ఎక్కడ ఉన్నా ఎప్పుడూ ఆమెతో ఉంటూ తమ సహాయాన్ని అందిస్తుండేవారు. ఆమె తన అనుభవాలను, కొన్ని పద్యాలను రచించి శ్రీసాయిలీల పత్రికకు ఇచ్చింది.

1921లో శ్రీమతి చంద్రాబాయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అది బాబా అనుగ్రహమే. వివరాలలోకి వెళితే... 1918 నాటికి ఆమెకు 48 ఏళ్ళ వయసు. అప్పటివరకు ఆమెకు సంతానం కలగలేదు. ఇక ఆ వయస్సులో సంతానం కలగటం అసంభవమన్న ఒకేఒక్క భావాన్ని ప్రజలు, వైద్యులు వ్యక్తపరుస్తున్నప్పటికీ సహజంగానే ఆమె సంతానం కోసం ఆరాటపడుతుండేది. బాబాకు ఆమె మనసు తెలుసు. 1918లో ఒకరోజు బాబా ఆమెను, “బాయీ! నీ మనోవాంఛ ఏమిటి?” అని అడిగారు. అందుకామె, “బాబా! మీకన్నీ తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేముంది?” అని బదులిచ్చింది. “సరే”నన్నారు బాబా. మూడు సంవత్సరాల తరువాత ఆమెకు నెలసరి ఆగిపోయింది. కొన్ని నెలలకి ఆమెను పరీక్షించిన డాక్టర్ పురందరే ఆమె కడుపున ఉన్నది బిడ్డ కాదు, ‘గడ్డ’ అనీ, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలనీ చెప్పాడు. బాబా మాటపై విశ్వాసంతో ఆమె వైద్యుని మాటను ఖాతరు చేయక “పది నెలల సమయంలో ఇదేమిటో నిర్ధారణ అవుతుంది” అని చెప్పింది. సుదీర్ఘకాలంగా గర్భం దాల్చనివారికి 51 సంవత్సరాల వయసులో సంతానం కలిగే అవకాశం ఏ మాత్రమూ లేదన్న అభిప్రాయాన్ని వైద్యుడు వ్యక్తపరిచాడు. కానీ సాయి కృపతో అసంభవం సంభవమైంది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత బాబా మహాసమాధి చెందిన మూడు సంవత్సరాల రెండు రోజులకు ధనత్రయోదశినాటి రాత్రి చెంబూరులో ఆమెకు సుఖప్రసవమై పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో వైద్యుడుగానీ, నర్సుగానీ లేరు. ఆమె ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవ సమయానికి ముందువరకు ఆమె మామూలుగానే తన రోజువారీ పనులన్నీ చేసుకుంది. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలల కాలంలో కాళ్ళవాపులు తదితర ఎన్నో సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమె నెలల తరబడి ఆహారం తీసుకొనేది కాదు. కేవలం ఊదీ, నీళ్లు మాత్రమే తరచూ తీసుకొనేది. అంతటి విశ్వాసం ఆమెకు సాయి పట్ల. ఇంకో విశేషమేమిటంటే, ఆమె తన సోదరునిగా భావించే తాత్యాకు కూడా బాబా ఆశీస్సులతో అదే సంవత్సరం, అదే యాభై ఏళ్ళ వయస్సులో కొడుకు పుట్టాడు.

Комментарии

Информация по комментариям в разработке